పిల్లి చనిపోతే కనుబొమలు తొలగించే ఆచారం ఎక్కడ ఉందొ తెలుసా ?


పూర్వం ఈజిప్టు దేశంలో ఎన్నో జంతువులను పూజించేవారు. 
మనుషుల కన్నా జంతువులే దేవుడికి దగ్గరగా ఉండే జీవులు అనే భావనతో 
ఈజిప్టు వారు ప్రతి జంతువును గౌరవించేవారు. అయితే అన్ని జంతువులలో 
పిల్లి అంటే ఈజిప్టు వారికి అత్యంత భక్తి. 

పిల్లిని చూడగానే దెయ్యాలు సైతం పారిపోతాయని వారి నమ్మకం. అందుకే ఎంతోమంది 
పిల్లులను తమ ఇళ్లలో పెంచుకోవడం మొదలుపెట్టారు. మరి రాజులు చనిపోతే పెద్ద 
పెద్ద పిరమిడ్లు కట్టే ఈజిప్టియన్లు, దేవునితో సమానమైన తమ పిల్లి చనిపోతే 
ఊరుకుంటారా? 

చనిపోయిన తమ పిల్లిని 'మమ్మీ'గా తయారుచేసి, ఘనంగా పూజలు జరిపి, 
దాన్ని పాతిపెట్టేవారు. పిల్లి శవపేటిక చుట్టూ పాల గిన్నెలే కాకుండా ఎలుకలను 
కూడా ఆహారంగా ఉంచేవారు. 

అంతేకాదు, తమ పిల్లి మరణించిందన్న దుఃఖంతో ఆ ఇంట్లోని వారందరూ తమ
 కనుబొమలను తొలగించేవారు. ఆ కాలంలో పిల్లులపై ఎంత భక్తి అంటే వాటిని
 పొరపాటున ఎవరైనా చంపేసినా, ఆ వ్యక్తికి మరణశిక్ష తప్పేది కాదు. 
ఆఖరికి వేటకు వెళ్లాలన్నా కుక్కలకు బదులు పిల్లులను వెంట తీసుకు 
వెళ్లవలసిందే!