సెక్ష‌న్ 8 అంటే ఏమిటి ? దీన్ని ఆంధ్రప్రదేశ్ ఎందుకు కావాలి అంటోంది? తెలంగాణా ఎందుకు వద్దు అంటుంది ?


telangana and andhrapradesh

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టం 2014 ప్ర‌కారం రెండో విభాగంలో పొందు ప‌రిచిన సెక్ష‌న్ 8 ను అమ‌లు చేసి తీరాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌ట్టుబ‌డుతుండ‌గా అవ‌స‌రం లేద‌ని, దాన్ని అమలును అడ్డుకోవ‌డానికి ఎంత‌దూరం వెళ్ళ‌డానికైనా వెన‌కాడ‌బోమ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోంది. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఇంత ప‌ట్టుద‌ల‌గా ఉండ‌డానికి ఇంత‌కీ ఆ సెక్ష‌న్‌లో ఏముంది?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టం (2014) రెండో భాగంలో సెక్ష‌న్ 8 కింద ఈ విష‌యాల‌ను పొందు ప‌రిచారు

1. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం నాటి నుంచి ఉమ్మ‌డి రాజధాని ప్రాంత ప‌రిపాల‌న‌, ఆ ప్రాంతంలో నివ‌సించే ప్ర‌జల ప్రాణాల‌కు భ‌ద్ర‌త‌, స్వేచ్ఛ‌, ఆస్తుల సంర‌క్ష‌ణ‌ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యేక అధికారాలు క‌లిగి ఉంటారు.
 
2. మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే… శాంతి భ‌ద్ర‌త‌లు, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌, ముఖ్య‌మైన వ్య‌వ‌స్థ‌ల సంర‌క్ష‌ణ‌, ఉమ్మ‌డి రాజ‌ధాని ప్రాంతంలో ప్ర‌భుత్వ భ‌వ‌నాల కేటాయింపు, నిర్వ‌హ‌ణ త‌దిత‌రాలు చూడాల్సిన బాధ్య‌త గ‌వ‌ర్న‌ర్‌కు ఉంటుంది.


3. ఈ బాధ్య‌త‌ల‌ నిర్వ‌హ‌ణ‌లో గ‌వ‌ర్న‌ర్ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించిన త‌ర్వాత ఆయ‌న త‌న వ్య‌క్తిగ‌త నిర్ణ‌యానుసారం తుది నిర్ణ‌యాలు, అంతిమ చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. ఏ అంశంలోనైనా ఏదైనా సంక్లిష్ట‌త‌ త‌లెత్తిన‌పుడు… గ‌వ‌ర్న‌ర్ ఈ స‌బ్ సెక్ష‌న్ ప్ర‌కారం వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం తీసుకోవ‌ల‌సి వ‌చ్చిన‌పుడు… ఆయ‌న త‌‌న విచ‌క్ష‌ణాధికారం ఉప‌యోగించి తీసుకున్న నిర్ణ‌య‌మే అంతిమం… ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించిన ఇద్ద‌రు వ్య‌క్తిగ‌త స‌ల‌హాదారులు గ‌వ‌ర్న‌ర్‌కు స‌హ‌క‌రిస్తారు.


4. నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత… గ‌వ‌ర్న‌ర్ ఆ విధంగా వ్య‌వ‌హ‌రించాల్సింది కాదు… లేదు…అలాగే వ్య‌వ‌హ‌రించాలి అని స‌వాలు చేసే అధికారం కూడా ఏ రాష్ట్ర ప్ర‌భుత్వానికీ ఉండ‌దు. దీన్ని కోర్టుల్లో స‌వాలు చేయ‌డానికి కూడా ఆస్కారం లేదు.


సాధార‌ణ ప‌రిస్థితుల్లో తెలంగాణ ప్ర‌భుత్వ‌మే పై అంశాల‌న‌న్నింటినీ చూసుకుంటుంది. ఎప్పుడైనా, ఎక్క‌డైనా వివాదం ఏర్ప‌డితే ఆ స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకునే వెసులుబాటు ఈ సెక్ష‌న్ క‌ల్పిస్తుంది. దీనివ‌ల్ల ఉమ్మ‌డి రాజ‌ధాని ప్రాంతంలో ఉండే పౌరుల శాంతిభ‌ద్ర‌త‌లు, ఆస్తుల సంర‌క్ష‌ణ వంటి అంశాల‌ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ పాత్ర చాలా కీల‌కం.


ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (‌జీహెచ్‌యంసి‌) సరిహద్దులే జాయింట్ కేపిటల్‌కు సరిహద్దులు. ఉమ్మడి రాజధాని ప్రాంతంలో నివసించే ప్రజల భద్రత, స్వేచ్ఛ, ఆస్తులను కాపాడే ప్రత్యేక బాధ్యతలను గవర్నర్ నిర్వహిస్తారు. వీటిపై ఇటు తెలంగాణకు గానీ, అటు ఆంధ్రప్రదేశ్ కు గాని అధికారాలు ఉండవు. 

ఉమ్మడి రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలు, అంతర్గతభద్రత, కీలకప్రాంతాలు, సంస్థాపనల భద్రత, ప్రభుత్వభవనాల కేటాయింపు, నిర్వహణల ప్రత్యేక బాధ్యతలను గవర్నర్ నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులను సంప్రదించిన తర్వాత గవర్నర్ తన విచక్షణ మేరకు న్యాయమని తోచిన నిర్ణయాన్ని తీసుకొని తగినచర్యలకు ఆదేశిస్తారు. 


ఈ విషయాలలో గవర్నర్ నిర్ణయమే అంతిమతీర్పుగా ఉంటుంది. ఆ నిర్ణయంలోని చెల్లుబాటును ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. తన వ్యక్తిగత తీర్పును అమలు చేసేటప్పుడు ఆయన వ్యవహరించిన తీరును ఎవరూ ప్రశ్నించజాలరు. కేంద్ర ప్రభుత్వం నియమించే ఇద్దరు సలహాదారులు గవర్నర్‌కు సహకరిస్తారు.


సెక్ష‌న్ 8పై ఇరు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలూ త‌మ త‌మ వైఖ‌రికి క‌ట్టుబ‌డి ఉంటే అంతిమ నిర్ణ‌యం తీసుకోవ‌ల‌సింది ఇక కేంద్ర‌మే!

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment