బంగారం బాండ్లు అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ పథకం ఉద్దేశ్యం ఏమిటి?

బంగారం బాండ్ల పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే ప్రజల వద్ద, ఆలయాలు, ట్రస్టులులాంటి వాటి వద్ద టన్నుల కొద్దీ మూలుగుతున్న బంగారం నిల్వలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో పన్ను రాయితీతో కూడిన గోల్డ్ మానిటైజేషన్ పథకాన్నీ తీసుకురావాలని నిర్ణయించింది. 
బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం కరవుభత్యం పెంచడానికి కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ ఆమోదించిన గోల్డ్ మానిటరైజేషన్ పథకం కింద ఏరూపంలో ఉన్న బంగారాన్నయినా బ్యాంకుల్లో ఏడాది నుంచి 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేయవచ్చు. అలాగే నిర్ణీత కాల పరిమితి ముగిసిన తర్వాత ఆ రోజు ఉన్న విలువకు తగినంత బంగారాన్ని తిరిగి పొందవచ్చు. కాగా ప్రజలు బంగారాన్ని ఒక పెట్టుబడిగా కొనుగోలు చేయడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బంగారం బాండ్ల పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. 

అయిదు, పది, 50, వంద గ్రాముల డినామినేషన్ల రూపంలో అయిదునుంచి ఏడేళ్ల కాలపరిమితితో బంగారం బాండ్లను జారీ చేస్తారు. పెట్టుబడి జరిపే రోజున ఉండే బంగారం విలువ ఆధారంగా బాండ్లపై చెల్లించే వడ్డీ రేటును లెక్కకడతారు. అయితే ఒక వ్యక్తి ఏడాదిలో 500 గ్రాములకు మించి ఈ బాండ్లను కొనుగోలు చేయరాదు. ఈ బాండ్లను కేవలం భారతీయులకు, సంస్థలకు మాత్రమే జారీ చేస్తారు. 

మదుపరులు త్వరగా ఈ పథకం నుంచి నిష్క్రమించడానికి వీలుగా ఈ బాండ్లను స్టాక్ ఎక్స్‌చేంజిలలో ట్రేడింగ్ జరుపుకోవడానికి కూడా అనుమతిస్తారు. ఈ పథకాల కింద పెట్టుబడులు పెట్టడం సురక్షితమే కాక ఆర్థికంగా కూడా నిలకడైన పెట్టుబడి మార్గమని కేబినెట్ నిర్ణయాలను విలేఖరులకు వివరిస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో జైట్లీ ఈ పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. 

గోల్డ్ మానిటరైజేషన్ పథకం కింద బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బంగారాన్ని అమ్మడానికి వాటిని అనుమతిస్తారు. దీనివల్ల దేశీయంగా బంగారం సరఫరా పెరగడమే కాక దిగుమతులపై ఎక్కువగా ఆధారపడ్డం తగ్గుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. ఈ పథకాలను త్వరలోనే ప్రవేశపెడతామని కూడా ఆయన చెప్పారు.


ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించిన బంగారం నగదీకరణ పథకానికి మోదీ సర్కార్‌ ఆమోదం తెలిపింది. ఈ పథ కం ద్వారా దేశంలో వివిధ సంస్థలు, వ్యక్తుల దగ్గర వృధాగా పడి ఉన్న బంగారాన్ని దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం సేకరిస్తారు. ఈ పథకం ప్రధాన అంశాలు.
బ్యాంకుల్లో గోల్డ్‌ సేవింగ్‌ అకౌంట్‌ పేరుతో ఖాతా తెరవాలి.
కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్‌ చేయాలి.
డిపాజిట్ల కాల పరిమితి 1-15 సంవత్సరాలు.
స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీని బ్యాంకులే నిర్ణయిస్తాయి.
మధ్య, దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
స్వల్ప కాలిక డిపాజిట్లను బంగారం లేదా నగదు రూపంలో రిడంప్షన్‌ చేసుకోవచ్చు.
మధ్య, దీర్ఘకాలిక డిపాజిట్లను మాత్రం నగదు రూపంలోనే రిడంప్షన్‌ చేస్తారు.
ఈ డిపాజిట్లకు క్యా పిటల్‌ గెయిన్స్‌, వెల్త్‌ టాక్స్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment