స‌ర్ సి.వి రామ‌న్


         ర్ సి.వి రామ‌న్ 1888 న‌వంబ‌రు 7న త‌మిళ‌నాడులోని తిరుచినాప‌ల్లిలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జ‌న్మించారు. ఆయ‌న త‌ల్లిదండ్రులు పార్వతి, చంద్రశేఖ‌ర్ అయ్యర్‌. రామ‌న్ పూర్తి పేరు చంద్రశేఖ‌ర వెంక‌ట రామ‌న్‌.
¤ ఆయన విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. 15 సంవ‌త్సరాల‌ వ‌య‌సులో డిగ్రీ, 18 ఏళ్ల వ‌య‌సులో భౌతిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందారు.
 
¤ ఎంఏ చదివి భారత ఆర్థిక శాఖ‌లో ఉద్యోగంలో చేరారు. 1907లో
 ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్‌ సైన్స్‌ 
అసోసియేషన్‌కు రోజూ వెళ్లి పరిశోధనలు చేసేవారు. రామన్‌ ఆసక్తిని 
గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ 
ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తూ... రామన్‌ సైన్స్‌ పరిశోధనలను
 పూర్తి కాలానికి నియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. 
కానీ, బ్రిటీష్‌ ప్రభుత్వం అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఉద్యోగానికి రాజీనామా
 చేసి పరిశోధనలు కొనసాగించారు. ఫ‌లితంగా ''రామన్‌ ఎఫెక్ట్‌'' ను కనిపెట్టారు. 

¤ 1928, ఫిబ్రవ‌రి 28న రామన్‌ ఎఫెక్ట్‌ను ఆవిష్కరించాడు. ఈ అంశం
 పై నేచర్‌ పత్రికలో ఆయన ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం 
ఆశ్చర్యపడింది. ఆయన రామన్‌ ఎఫెక్ట్‌ను ఆవిష్కరించిన రోజును 
(ఫిబ్రవరి 28 ను) భార‌త ప్రభుత్వం 'నేషనల్‌ సైన్స్‌ డే'గా గుర్తించింది. 

¤ 1943లో బెంగ‌ళూరులో రామ‌న్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ఆయ‌న 
స్థాపించారు. ఆయ‌న మ‌ర‌ణించే వ‌ర‌కు ఇన్‌స్టిట్యూట్‌కు 
డైరెక్టర్‌గా సేవ‌లందించారు. 

¤ సి.వి. రామ‌న్ 82 సంవ‌త్సరాల వ‌య‌సులో 1970, న‌వంబ‌రు
 21న బెంగ‌ళూరులో తుదిశ్వాస విడిచారు. 

పురస్కారాలు

¤ కోల్‌కతా విశ్వవిద్యాల‌యం 1921లో డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రధానం చేసింది. 

¤ 1929లో బ్రిటిష్ ప్రభుత్వం స‌ర్ బిరుదుతో రామ‌న్‌ను స‌త్కరించింది. 

¤ 1930 డిసెంబర్‌లో నోబెల్‌ బహుమతి పొందారు. 

¤ 1954లో ప్రతిష్టాత్మక‌ భారతరత్న అవార్డు పొందారు. 

¤ 1957లోలెనిన్ శాంతి పురస్కారం అందుకున్నారు.

ప‌నిచేసిన సంస్థలు: 

మ‌ద్రాసు ప్రెసిడెన్సీ కాలేజి, భారత ఆర్థిక విభాగం, ఇండియన్ అసోసియేషన్ 
ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్.
రామన్‌ ఎఫెక్ట్‌:
            సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతి లోని నీలం
 రంగు ఎక్కువగా పరిక్షేపం (scattering) చెంది (చెదిరి) మన కంటికి చేరడం 
వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని సర్‌ సి.వి. రామన్‌ సిద్ధాంతీకరించారు.
 ఈ విధంగా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో 
తెలిపే పరిశోధన ఫలితాన్నే 'రామన్‌ ఎఫెక్ట్‌' అంటారు.

¤ కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం 
చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్‌ కణాలు, ద్రవ 
పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు
 పడేట‌ప్పుడే పౌనఃపున్యంలోనే పరిక్షేపం చెందితే, కొన్ని ఫోటాన్లు మాత్రం
 అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన
 కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో పరిక్షేపం 
చెందుతాయన్నమాట‌. ఇదే రామన్‌ ఎఫెక్ట్‌. దీన్ని కనుగొన్నందుకు 
ఆయన 1930లో నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. 

¤ రామన్‌ ఎఫెక్ట్‌ ద్వారా రసాయనిక పదార్థాలలో అణు, పరమాణు 
నిర్మాణాల పరిశీలనకు, పరిశ్రమల్లో కృత్రిమ రసాయనిక సమ్మేళనాల 
పరిశీలనకు, మనం ధరించే వస్త్రాల రంగులు, వైద్య రంగంలో 
అవసరమయ్యే మందుల విశ్లేషణకు ఉపయోగపడుతుంది.

¤ 1960లో ఆవిష్కరించిన లేజ‌ర్ కిర‌ణం రామ‌న్ ఎఫెక్ట్‌ను 
ప్రభావ‌వంతంగా ప్రదర్శించ‌డంలో లేజ‌ర్ 'రామ‌న్ స్పెక్ట్రోస్కోపి' అవ‌త‌రించింది.
 ఈ ప్రక్రియ ప‌రిశ్రమ‌ల్లో, ఔష‌ధ‌ నిర్మాణ శాస్త్రంలో, జీవ‌శాస్త్ర ప‌రిశోధ‌న‌ల్లో,
 కేంద్రక సంయోగంలో శ‌క్తివంత‌మైన సాధ‌నంగా ఉప‌యోగిస్తారు.